
సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇది. ఆయన హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు(మే 31) పురస్కరించుకొని ‘సర్కారువారి పాట’ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపించాయి. దీంతో మే 31న తమ అభిమాన హీరో సరికొత్త లుక్‌ని చూడచ్చని భావించిన మహేశ్ ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ‘సర్కారువారి పాట’నుంచి ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తమ తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్‌డేట్ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాం. అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా జీవించండి’ అని మహేశ్ టీమ్ ట్వీట్ చేసింది.
‘సర్కారువారి పాట’ విషయానికి వస్తే..పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథా నాయికగా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.