
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి పీఎస్‌లో అతనిపై మరో కేసు నమోదైంది. కోకాపేట విల్లాలో ఉండగా రాజ్‌తరుణ్ అతని అనుచరులతో దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్తరుణ్తో పాటు అతని అనుచరులైన మణికంఠ, రాజశేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజపై కేసు నమోదు చేశారు. తనపై మూడు సార్లు దాడి చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో లావణ్య- రాజ్ తరుణ్ ఎపిసోడ్ టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
కాగా.. 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేట్‌లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.