
ఈ దీపావళికి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా ‘కె- ర్యాంప్’(K- Ramp Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్‌మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు.

మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్. ఇలాంటి సినిమాలలో లాజిక్స్ గురించి వెతుకొద్దు. కథలో కొత్తదనం, ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్ కామెడీ సీన్లతో ఫన్ జనరేట్ చేస్తే చాలు.. ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతారు. నూతర దర్శకుడు జైన్స్ నాని అదే పని చేశాడు. కథపై దృష్టిపెట్టకుండా హీరో కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్లాడు. అవి హిలేరియస్ అనిపించాయి. రొటీన్ కామెడీ స్టోరీకి చివరిలో ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. రాజశేఖర్ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్‌గానే సాగుతుంది. కుమార్ కేరళకు వెళ్లడం.. మెర్సీని చూసి ప్రేమలో పడడం.. ఆమె కోసం చేసే పనులు ఇవ్వన్నీ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం హీరోయిన్ ఉన్న ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడనేదే చూపించారు.

అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్ డోస్ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు వెన్నెల కిశోర్.. మరోవైపు నరేశ్..వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు..ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్ చెప్పే మాటలు.. సాయి కుమార్-కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. నరేశ్ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్‌కి వెళితే.. హాయిగా నవ్వుకొవచ్చు.
ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రానికి కిరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్, ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. సెకండాఫ్‌లో మాత్ర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై కిరణ్-యుక్తిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే కిరణ్ పాత్ర పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోని గుర్తు చేస్తే.. యుక్తి పాత్ర మారుతి సినిమాల్లోని హీరోయిన్‌ని గుర్తు చేస్తుంది. ఇక వీకే నరేశ్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. అయితే ఆయనకు ఇంకొన్ని సీన్లు పడితే బాగుందనిపించింది.

ఇక వెన్నెల కిశోర్ కనిపించేది కాసేపే అయినా.. ఆ ఎపిసోడ్ అదిరిపోతుంది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
