
విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు రమణ, నందా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునైనా నాయకిగా చేస్తున్నారు. ఏ.వినోద్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్‌ను నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. విశాల్ పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో పోరాట దృశ్యాలనే 68 రోజులు చిత్రీకరించినట్లు నిర్మాతలు తెలిపారు. కాగా చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని ఆరు కెమెరాలతో చిత్రీకరించినట్లు విశాల్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్ర క్‌లైమాక్స్‌కు ముందు కథ వేగంగా సాగుతుందని, అప్పుడు తన కొడుకు కిడ్నాప్‌కు గురి కావడంతో ఏం చేయాలో పాలుపోక ఏడవాలని దర్శకుడు చెప్పారన్నారు. అప్పుడు తనకు బాలా దర్శకత్వంలో అవన్ ఇవన్ చిత్రంలో నటించిన ఎమోషనల్ సన్నివేశాలు గుర్తుకొచ్చాయన్నారు. దీంతో ఈ సన్నివేశాన్ని ఒకే టేక్‌లో నటిస్తానని, మళ్లీ టేక్‌లు అడగరాదని చెప్పానన్నారు. దర్శకుడు వెంటనే ఆరు కెమెరాలు రప్పించి షూట్ చేశారన్నారు. ఆ షాట్ ఎలా వచ్చిందో అన్న టెన్షన్‌తో ఉన్న తనకు దర్శకుడు ఓకే అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని అన్నారు. చిత్ర టీజర్‌ను ఈ నెల 24వ తేదీ భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్ తెలిపారు.