
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రూ.102.55 కోట్ల జరిమానా విధించారు. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల పెనాల్టీ విధిస్తూ జైల్లోనే నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్‌ఐ అధికారులు హెచ్చరించారు.
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులకు ఏడాది పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్ జైన్‌లకూ శిక్ష పడింది.
రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.