
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీస్‌తో కలిసి చూడాల్సిన సినిమా ఇది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు.
అనుపమ సంగతులు
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, సంగీత, దర్శన, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సపోర్ట్‌తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన సంగతులు.
కనెక్ట్ అయ్యా..
‘పరదా’లాంటి కథలు తెలుగులోనే కాదు... భారతీయ సినిమాలోనూ చాలా అరుదు. ఈ తరహా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో కూడిన కథ నా దగ్గరకు రాలేదు. అందుకే దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్‌గా భావిస్తాను.
సవాల్‌గా తీసుకున్నా..
ఈ చిత్రంలో చాలావరకు నేను పరదా ధరించిన సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కొన్ని సీన్స్‌లో సైలెంట్‌గానే ఉంటాను. అయితే నా పరదా వెనక నా క్యారెక్టర్ తాలూకు భావోద్వేగం కనిపిస్తుంది. నా కళ్లతో, నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్‌తో నేను నటించగలిగానని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. ‘పరదా’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
కారులో కూర్చుని ఏడ్చేశా..
నిజానికి నేను స్విచ్చాన్, స్విచ్చాఫ్ యాక్టర్‌ని. అయితే ‘పరదా’ మాత్రం వెంటాడింది. నా పాత్రకు ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేశాయి. కారులో కూర్చుని ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ‘పరదా’ సినిమా పురుషులకు కాస్త వ్యతిరేకంగా ఉందన్నట్లుగా ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది.
విద్యాబాలన్‌పై ముద్ర
ఓ హీరోయిన్ నటించిన ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. గతంలో మోహన్‌లాల్‌గారితో విద్యాబాలన్‌గారు చేయాల్సిన సినిమా ఒకటి ఇలాంటి కారణం (ఐరన్ లెగ్) వల్లే క్యాన్సిల్ అయ్యిందట. ఆ తర్వాత విద్యాబాలన్ చేయాల్సిన తొమ్మిది సినిమాల నుంచి ఆమెను తప్పించారట. ఇది ఎంతవరకు కరెక్ట్?
అదెందుకు పట్టించుకోరు?
‘పరదా’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ‘డీజే టిల్లు 2’ సినిమాలో మరో విభిన్నమైన పాత్ర చేశాను. ‘డీజే టిల్లు 2’లో నేను గ్లామరస్‌గా కనిపించిన విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ, అందులో నేను గన్ పట్టుకుని, యాక్షన్ చేశాను. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ అంశాలు హైలైట్ కావడం లేదు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది.
చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్