
అండర్‌పాస్‌లు.. సర్వీసు రోడ్లు
ప్రజల కోరిక మేరకే..
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నాం. ఇందు లో భాగంగా కోమటిపల్లి, వల్లూరు వద్ద జంక్షన్ల అభివృద్ధి, బైపాస్ రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రజల విజ్ఞప్తి మేరకే తాను నిధులు మంజూరు చేయించా.
– రఽఘునందన్‌రావు, ఎంపీ
రామాయంపేట(మెదక్): మండల పరిధిలోని కోమటిపల్లి, వల్లూరు వద్ద సర్వీస్ రోడ్లు, వడియారం వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణానికి కేంద్రం రూ. 44.17 కోట్లు మంజూరు చేసింది. వడియారం అండర్ పాస్ వద్ద కిలోమీటర్, కోమటిపల్లి, వల్లూరు జంక్షన్ల వద్ద రెండున్నర కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు వెల్లడించారు. వీటి నిర్మాణం పూర్తయితే ఈ జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కోమటిపల్లి వద్ద జాతీయ రహదారి–44 దాటుతున్న క్రమంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామ శివారులో కేజీబీవీతో పాటు మోడల్ స్కూల్ ఉంది. ఈ రెండు స్కూళ్లలో కనీసం 500 వందల మంది విద్యార్థులు చదువుతున్నారు. కస్తూర్బా విద్యార్థులు స్కూల్ హాస్టల్‌లోనే ఉంటుండగా, మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిరోజు వెళ్లి వస్తుంటారు. స్కూల్ ముగియగానే తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు కేంద్రం రూ. 44.17 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థులు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా నేరుగా సర్వీస్ రోడ్డు మార్గంలోనే స్కూళ్లకు వెళ్లే విధంగా రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరారు. జాతీయ రఽహదారుల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వడియారం వద్ద జాతీయ రహదారిపై నిర్మించనున్న అండర్ పాస్ బ్రిడ్జి వద్ద 6 వరుసల రోడ్డు నిర్మించనున్నారు.
కోమటిపల్లి జంక్షన్
నిర్మాణాలకు రూ. 44.77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

అండర్‌పాస్‌లు.. సర్వీసు రోడ్లు