నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి

Jun 20 2026 11:31 AM | Updated on Jun 20 2026 11:31 AM

అలంపూర్‌: వానాకాలం పంటకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులు ఏ పొల్లాల్లో ఏ పంట వేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలతో పంట సాగు చేస్తే ఏ పంటలోనైనా అధిక దిగుబడి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన విత్తనాలు నాలుగు రకాల్లో లభ్యమవుతాయని ఏఓ వివరించారు. విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బ్రీడర్‌, సర్టిఫైడ్‌, టూత్‌ ఫూల్‌ లేబుల్స్‌లో లభిస్తాయని ఇందులో ఏ రకాన్ని సాగు చేసినా విత్తనంగా మార్చుకోవచ్చని తెలిపారు.

బ్రీడర్‌ విత్తనం..

ఇది అన్నీ రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు తయారు చేసేది ఇలాంటి విత్తనాలే. ఈ విత్తనం వంద శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్‌ సీడ్‌కు బంగారు రంగు ట్యాగ్‌ వేస్తారు. సీడ్‌ ధర ఎక్కువ ఉంటుంది. ఒక్కో రైతుకు రెండు కిలోల చొప్పున సరఫరా చేస్తారు.

ఫౌండేషన్‌ విత్తనం..

ఈ విత్తనాన్ని బ్రీడర్‌ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి బ్రీడర్‌ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్‌ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్‌కు తెలుపు రంగు ట్యాగ్‌ వేస్తారు.

సర్టిఫైడ్‌ (ధ్రువీకరించిన) విత్తనం

దీన్ని ఫౌండేషన్‌ విత్తనం నుంచి వేరుగా ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంటుంది. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్‌ వేస్తారు.

ట్రూత్‌ ఫూల్‌ లేబుల్‌ విత్తనం

సర్టిఫైడ్‌ విత్తనం నుంచి ఉత్పత్తి చేసిన ఈ విత్తనాన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ విత్తనాలను ట్రూత్‌ ఫూల్‌ లేబుల్‌ కింద రైతులకు విక్రయిస్తారు. ట్రూత్‌ ఫూల్‌ లేబుల్‌ విత్తనానికి ఆకు పచ్చ రంగు ట్యాగ్‌ వేస్తారు.

లేబుల్‌ ట్యాగ్‌పై ఉండే వివరాలు

విత్తన పరీక్ష చేయబడిన తేదీ, ఆ తేది నుంచి 9 నెలల కాల పరిమితిలోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.

గమనించాల్సిన అంశాలు

విత్తనం కొనేముందు కనీస మొలక శాతం, జన్యు స్వచ్ఛత, గరిష్ట తేమ శాతం తదితర వివరాలు చూసుకోవాలి.

విత్తన సంచిపై లేబుల్‌తోపాటు సరిగ్గా సీల్‌ లేకున్నా, విత్తనాలు కొనొద్దు.

తేమ అధికంగా ఉన్న చోట, మిర్చి విత్తనాల దగ్గర, సిమెంట్‌, క్రిమి సంహారక మందులు, ఎరువుల సంచుల వద్ద, సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో నిల్వ చేసిన విత్తనాలు కొనుగోలు చేయొద్దు.

అడ్వాన్స్‌గా విత్తనాలు బుకింగ్‌ చేయొద్దు

రాత్రికి రాత్రి విక్రయించే అపరిచిత వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. అనుమానం వస్తే ఆయా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement