మాదకద్రవ్యాల కట్టడికి సమష్టిగా కృషి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల కట్టడికి సమష్టిగా కృషి

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

ఎస్పీ జానకి పిలుపు

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని డీ–అడిక్షన్‌ సెంటర్‌ను శుక్రవారం ఆమె సందర్శించి.. వైద్య సేవలు, ఇతర సమస్యలపై ఆరాతీశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురై చికిత్స కోసం ఎంతమంది వస్తున్నారు..? ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు..? చికిత్స తర్వాత వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయని తెలుసుకున్నారు. అనంతరం కొద్దిమంది రోగులతో ఎస్పీ మాట్లాడి వైద్యసేవలతోపాటు కౌన్సిలింగ్‌ విధానం, కుటుంబ సభ్యుల సహకారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారినపడిన వారిని నేరస్తులుగా కాకుండా సరైన మార్గదర్శనం, చికిత్స, కౌన్సెలింగ్‌ అవసరమైన బాధితులుగా చూడాలన్నారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వారిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్‌ శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్‌, గంజాయి వంటి సరఫరా లేదా వినియోగం చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రంగా ఆజ్మీ రా, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనిల్‌రాజ్‌, ఆర్‌ఎంఓ దుర్గ, టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌ పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, వాహనదారులు అన్ని రకాల డాక్యుమెంట్స్‌ వెంట పెట్టుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దివిటిపల్లి డబుల్‌ బెడ్‌రూం కాలనీలో శుక్రవారం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి వివరాలు పరిశీలించడంతోపాటు సరైన పత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఆరు ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్‌, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement