ధరూరు: తాను రైల్వే ఉద్యోగినంటూ నమ్మించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేసిన ఒక ఘరానా మోసం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో వెలుగు చూసింది. ఉద్యోగాలు రాకపోగా.. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మొహం చాటేసిన వ్యక్తిపై ఓ బాధితుడు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం వివరాలను ఎస్‌ఐ నందికర్ వివరించారు. గద్వాల మండలం పూడరుకు చెందిన పుల్లన్న తాను రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నానని, ఆయా గ్రామాల్లోని నిరుద్యోగుల తల్లిదండ్రులను నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన మండలంలోని అల్వలపాడుకు చెందిన కొందరు నిరుద్యోగుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తే తమ జీవితాలు బాగు పడతాయని ఆశపడ్డారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకున్నాడు. నిందితుడు సుమారు 16.80లక్షలు వసూలు చేశాడన్నారు. డబ్బులు తీసుకుని చాలాకాలం కావడంతో తమ ఉద్యోగాలపై ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. రేపు, మాపు అంటూ నెలల తరబడి కాలయాన చేస్తూ వచ్చాడు. చివరకు మొహం చాటేసి తిరుగుతుండడంతో.. తాము మోసపోయామని గ్రహించి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్‌ఐ కోరారు. త్వరలోనే నిందితున్ని అరెస్టు చేస్తామని తెలిపారు.


