
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
వంగూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజాభిప్రాయం మేరకే విద్యాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ ఆకునూరి మరళి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కళాశాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నాలుగు పాఠశాలలకు దాదాపు 8 ఎకరాల స్థలం ఉందని, ఈ స్థలంలో తరగతి గదులు, క్రీడాప్రాంగణాలు, ల్యాబ్‌లు, డైనింగ్ సెక్షన్లను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో లేని వసతులు కల్పించేందుకు రూ.11 కోట్లు దాతల నుంచి సేకరించినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం పేరెంట్స్ కమిటీతో పాటు పాఠశాల అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యావిధానంలో పెనుమార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే వంగూరు పాఠశాలలను నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి సెమిరెసిడెన్షియల్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్‌సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 16న ఇదే పాఠశాలలో మరో సమావేశం నిర్వహించిన అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. సమావేశంలో విద్యా కమీషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, జ్యోత్నారెడ్డి, డీఈఓ రమేష్‌కుమార్, ఎంఈఓ మురళీమనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు
వంగూరులో ఒకే గొడుగు కిందకు ప్రభుత్వ పాఠశాలలు
రూ.11 కోట్లతో అభివృద్ధి
రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి