
హత్యనా.. ప్రమాదమా ?
గట్టు: మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. ప్రమాదం కాదు హత్య అని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తు ఆందోళన చేశారు. వివరాలు.. ఆలూరు గ్రామానికి చెందిన కుర్వ నర్సింహ(35) ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో చికెన్ ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లినట్లు భార్య పల్లవి తెలిపారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నర్సింహకు ఫోన్ చేయగా స్విఛాఫ్ వచ్చిందని తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరోమారు చేయగా ఫోన్ స్విఛాప్ రావడంతో ధరూరులో ఉండే మరిది రమేష్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వాయిల్‌కుంటతండా వాసులు చెరువు గట్టున వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి ఆలూరు గ్రామస్తులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆలూరుకు చెందిన కుర్వ నర్సింహ(35)గా గుర్తించారు. మృతుడు విద్యుత్ తీగలపై పడి ఉంటడాన్ని గమనించి ప్రమాదం కాదు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మృతుని ద్విచక్రవాహనం గ్రామ చావిడి దగ్గరే ఉందని, వాయిల్‌కుంటతండా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన స్వాములు, తిమ్మప్ప, గోకారన్న, గోవిందు, నరేంద్రనాయక్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మల్లేష్ వివరాలు సేకరించారు. మృతుని భార్య పల్లవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య పల్లవి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హత్య చేశారంటూ
కుటుంబ సభ్యుల అనుమానం
చెరువు గట్టున విద్యుత్ తీగలపై మృతదేహం
కేసు నమోదు