మహానంది: కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేక రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన గోపవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మనాయుడు దంపతుల రెండో కుమారుడు ముత్తా మదన్ (27) వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులకు వెళ్లేవాడు. కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగా లేక మనోవేదనకు గురయ్యేవాడు. ఈ స్థితిలో మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న నంద్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఐదుగురికి జైలుశిక్ష
ఆదోని రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురికి నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు తాలూకా సీఐ నల్లప్ప బుధవారం తెలిపారు. ఇందులో సింధనూరు తాలూకా రాయచూరు జిల్లాకు చెందిన యన్నూరు, ఆదోని పట్టణానికి చెందిన ఎం.పెద్ద ఈరన్న, ఆస్పరి మండలం నగరూరుకు చెందిన బాట రామకృష్ణ, ఆదోని పట్టణానికి చెందిన ఎరుకల సుంకన్న, సాంబగల్లు గ్రామానికి చెందిన సూరిపోగుల రాజు ఉన్నారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు.
పంచాయతీ సెక్రటరీకి రిమాండ్
వెల్దుర్తి: పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ ఇంటి అప్రూవల్ కొరకు మంగళవారం ఓ టీస్టాల్ వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ స్థానిక మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను బుధవారం ఏసీబీ కర్నూలు కోర్టులో హాజరుపరుచగా జడ్జి 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పంచలింగాల డిస్ట్రిక్ జైలుకు తరలించినట్లు చెప్పారు. మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుకున్న సెక్రటరీని ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వరకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారించారు. సతీష్ తాను ఇంటి అప్రూవల్ కొరకు పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం, ఆ అర్జీని సెక్రటరీ లక్ష్మీనాథ్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మకు పంపడం, అనంతరం స్పెషల్ ఆఫీసర్ కార్యాలయానికి పంపడం తదితరాలను సెక్రటరీని, తహసీల్దార్‌ను విచారించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆయన్ను కర్నూలుకు తరలించారు. పట్టుబడ్డ నిందితుడికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, అవినీతి ఆదాయ పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఊరి వేసుకుని యువకుడి బలవన్మరణం
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని వగరూరు గ్రామంలో మద్యం తాగి యువకుడు ఫ్యాన్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన ముల్లా రహిమాన్ (30) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. తాను అప్పుల పాలయ్యానని, బతికినా దండగ అంటూ తరచూ చెప్పేవాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతనికి సర్ధి చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య బషీరూమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముంభైలో కోసిగి యువకుడి ఆత్మహత్య
కోసిగి: మండల కేంద్రంలోని సిద్దప్ప పాళెం ఊరువాకిలి సమీపంలో నివాసం ఉంటున్న కోదండ వెంకటేష్, సునీత దంపతుల కుమారుడు సాయికుమార్ (22) బుధవారం ముంభైలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడు డిగ్రీ వరకు చదువుకుని గతేడాది నుంచి ముంభైలో బంధువుల వద్ద ఉంటూ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఈ స్థితిలో ఏమైందో గానీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంభైకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది.


