బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహణపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి వంద రోజుల జాతీయ ప్రచారంలో మూడు దశల్లో నిర్వహించనున్నారన్నారు. నవంబర్ 27 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మొదటి దశ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. రెండో దశలో 2026 జనవరి 1 నుంచి మసీదులు, చర్చీలు, దేవాలయాల్లో సదస్సు లు నిర్వహించాలన్నారు. మూడో దశ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 8వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కల్పించాలన్నారు. అడిషినల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, ఐసీడీఎస్ పీడీ విజయ, డీటీసీ శాంతకుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు జుబేదా బేగం, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, సోషల్‌వెల్ఫేర్ డీడీ రాధిక, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసూన పాల్గొన్నారు.
మానవ హక్కులపై అవగాహన
కర్నూలు: స్థానిక బి.క్యాంప్‌లో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందంపై అవగాహన కల్పించడానికి 1948 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ‘మన హక్కులు – మన భవిష్యత్తు’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జడ్జి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద రెడ్డి, ప్రొఫెసర్లు యల్లా కృష్ణ, సబితా రెడ్డి, మల్‌రెడ్డి నాగార్జున పాల్గొన్నారు.
చిన్నకొత్తిలిలో ‘డెంగీ’ భయం
నందవరం: మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నాలుగు డెంగీ కేసులు నమోదైనట్లు పీహెచ్‌సీ డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. బుధవారం గ్రామంలో వైద్యాధికారులు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దోమల నివారణకు ఇంటింటికి తిరిగి హైప్రోద్రావణం పిచికారీ చేశామన్నారు. గ్రామంలో రెండు రోజుల పాటు మెడికల్ క్యాంపు నిర్వహిస్తునట్లు వివరించారు.
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో కర్నూలు నగరంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆదోని, ఎమ్మిగనూ రు, హైదరాబాదులో ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. 9.30 గంటలకు మొదలైన పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల దగ్గరకు చేరుకోగా, అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 665 మందికిగాను, 590 మంది హాజరై, 75 మంది గైర్హాజరయ్యారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తనిఖీ చేశారు.
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు


