
సచివాలయంలో ఇంటర్‌నెట్ ఇక్కట్లు
వెలుగోడు: గ్రామస్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు. పట్టణంలోని సచివాలయం–2లో రెండు నెలలుగా ఫైబర్ నెట్ ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. ఏపీ ఫైబర్ నెట్ పని చేయడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథడు లేడు. దీంతో ఉద్యోగులు తమ సెల్ ఫోన్ హాట్ స్పాట్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. సెల్ నెట్ సరిగా అందకపోవడంతో సర్వర్ సరిగా పని చేయక ప్రజలు గంటల తరబడి సచివాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. సచివాలయ వ్యవస్థ లేనప్పుడు గతంలో మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ స్థానికంగానే సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస్తూ సేవలన్నింటినీ వారి చెంతకే తీసుకొచ్చారు. గతంలో 35 విభాగాలకు సంబంధించి 545 ప్రభుత్వ సేవలను అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది.
మూడు ఆధార్ కేంద్రాలే దిక్కు
కూటమి ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషనన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కాగా.. పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం.. ఒకేసారి వందలాది మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు రావడంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మండలంలో కేవలం మూడు సచివాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయి. వెలుగోడు పట్టణంలోని సచివాలయం–2లో ఇంటర్ నెట్ సౌకర్యం లేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల్పనూరు, గుంతకందాల సచివాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాలు పని చేస్తుండగా, వేల్పనూరులో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను అప్‌లోడ్ చేస్తుండటంతో తంబ్ వేసే అవకాశం లేకుండా పోయింది. సరిగా వేలిముద్రలు పడనవి ప్రస్తుతం పెండింగ్‌గా చూపడంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో సమస్యలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పిల్లలు, పెద్దలవి ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. ఈ మేరకు పెండింగ్ కార్డుదారుల జాబితాలను సిద్ధం చేసి డీలర్లకు అందించారు. ప్రస్తుతం ఈకేవైసీ పూర్తికాకపోతే స్మార్ట్ కార్డులు అందవనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. దీంతో రేషన్ కార్డుదారులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తూ ఈకేవైసీ చేయించుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో ఈకేవైసీ పూర్తి చేసుకునేలా అన్ని సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
సెల్‌ఫోన్ హాట్‌స్పాట్‌తో
రెండు నెలలుగా సేవలు
రేషన్ కార్డు దరఖాస్తులకు
తప్పని అవస్థలు
ఈకేవైసీ కోసం లబ్ధిదారుల పడిగాపులు