
ప్రగతి.. వెనుక‘బడి’
ఆదోని సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నా పూర్తి చేయలేకపోయారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు ఇచ్చారు. అ యితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అదనపు తరగతి గదులను పనులు పూర్తి చేయలేకపోయింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సర్కార్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోయాయి. విద్యార్థులు నేలపైన సాగే చదువులకు స్వస్తి పలికారు. డిజిటల్ బాటలో చదివే బాట పట్టారు. ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ, ఎయిడెడ్, పురపాలక గురుకుల పాఠశాలలు మొత్తం 130 ఉన్నాయి. అయా పాఠశాలల్లో 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు– నేడులో భాగంగా గత ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణాల పనులను చేపట్టింది. ఒక్కోక్క గది నిర్మాణానికి రూ.12 లక్షలు చొప్పున 38 పాఠశాలల్లో 162 అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో పరుగులు పెట్టిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక అర్ధాంతరంగా నిలచిపోయాయి. దీంతో ఏమి చేయాలో తెలియక అయా పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదులల్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి విద్యను అందిస్తున్నారు. కొన్ని చోట్ల వరండాలోనూ, చెట్ల కింద విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది.
ఇదీ దుస్థితి
● ఆదోని పట్టణంలోని అర్‌అర్ లేబర్ కాలనీలో పురపాలక ఉన్నత పాఠశాల, నెహ్రూ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
● కల్లుబావిలోని ప్రాథమిక పాఠశాల, డణాపురంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విరుపాపురం, పెద్దహరివాణం, పెద్దతుంబళం, అరెకల్లు వంటి పలు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.
● ఆదోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.
● కిటికీలు, తలుపులు, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్ వంటి పనులను పూర్తి చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు.
ఒక్కపైసా కూడా ఇవ్వలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న నాడు– నేడు అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆదోని పట్టణంలోని అర్‌అర్ లెబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో 960 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు గదులు ఉన్నాయి. నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అలాగే నెహ్రుమోమోరియల్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గదులు పూర్తిగాక అసంపూర్తిగా ఉండడంతో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కొంత డబ్బులు వెచ్చించి తరగతి గదులు కీటికీలు, తలుపులు ఫ్లోరింగ్ వంటి పనులను చేపట్టి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.
నిధుల కోసం ఇండెంట్ పెట్టాం
అదనపు తరగతి గదుల పనులు మధ్యలో ఆగిపోయాయి. చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గదుల నిర్మాణాలపై అధికారులకు ఇండెంట్ పెట్టాం. ఒక వేళ ప్రభుత్వం నిధులను విడుల చేస్తే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం.
– శ్రీనివాసులు మండల విద్యాధికారి–2 ఆదోని
అసంపూర్తిగా తరగతి గదుల
నిర్మాణాలు
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు
తప్పని తిప్పలు
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

ప్రగతి.. వెనుక‘బడి’

ప్రగతి.. వెనుక‘బడి’