
అధికారం ఇచ్చింది దోచుకునేందుకేనా ?
● ఎమ్మెల్యేగా చికెన్ దందా తగునా ● అక్రమార్జన కోసం ప్రజలపై భారం మోపుతారా? ● ఏజెంట్లను పెట్టి వ్యాపారులను బెదిరిస్తారా? ● ఆళ్లగడ్డ ఎమ్మెల్యేపై వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి విమర్శలు
ఆళ్లగడ్డ: ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టమెచ్చినట్లు దోచుకునేందుకేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో చాగలమర్రిలో చికెన్ సెంటర్‌ల నిర్వాహకులను అందరిని తమ దగ్గరే చికెన్ కొనుగోలు చేయాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ మండలానికి ఒక ఏజెంట్‌ను పెట్టి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇంత వరకు ఇలాంటి దందా ఎవరూ చేయలేదన్నారు. కిలోకు రూ. 35 అదనంగా డిమాండ్ చేస్తున్నారని, ఇందులో ఎమ్మెల్యేకు రూ. 25, ఏజెంట్లకు రూ. 10 లెక్కన నిర్ణయించి వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది సామాన్యమైన స్కామ్ కాదు. ఒక్క ఆళ్లగడ్డ పట్టణంలోనే రోజుకు 5 వేల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. నెలకు రూ. కోటి పైగా వసూళ్లు చేయడమే లక్ష్యంగా దందా కొనసాగిస్తున్నారు. ఇదంతా చికెన్ తినే సామాన్య ప్రజలపై భారం మోపడమే కదా అని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన సామాన్యులను దోచుకోనేందుకేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ డాన్‌గా ఎమ్మల్యే అఖిలప్రియ పేరు గాంచారన్నారు. ఎవరైనా మాట్లాడినా.. మీడియాలో కథనాలు రాసిన ఆధారాలు ఉన్నాయా అంటూ బొంకుతూ పరువు నష్టం దావాలు వేస్తామంటూ బెదిరించడం తగదన్నారు. నేరుగా పోలీసులు మీడియా ముందు పేర్లు చెబుతున్నారని, వారి ఫొటోలతో చికెన్ డాన్ అఖిలప్రియ అని అన్ని మీడియాల్లో కోడై కూస్తుందన్నారు. ఇప్పుడు ఆ మీడియా కార్యాలయాల దగ్గరకు వెళ్లి కోళ్లు, కోళ్ల పెంట తీసుకెళ్లి నిరసన తెలపాలన్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధులతోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ పరువు పోతోందని విమర్శించారు.