విద్యార్థుల చూపు.. ట్రిపుల్‌ ఐటీ వైపు! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల చూపు.. ట్రిపుల్‌ ఐటీ వైపు!

May 5 2025 8:46 AM | Updated on May 5 2025 8:46 AM

విద్యార్థుల చూపు.. ట్రిపుల్‌ ఐటీ వైపు!

విద్యార్థుల చూపు.. ట్రిపుల్‌ ఐటీ వైపు!

కోవెలకుంట్ల: 2025–26 విద్యా సంవత్సరానికి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)కళాశాలల్లో సీట్లు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత నెల 23వ తేదీన పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల కాగా ఇటీవలే ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 456 ప్రభుత్వ పాఠశాలలుండగా గత నెలలో విడుదలైన పది ఫలితాల్లో 54 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని ఆయా పాఠశాలల పరిధిలో 11,794 మంది బాలికలు పరీక్షలు రాయగా 9,954 మంది, 12,702 మంది బాలురకు గాను 10,097 మంది బాలురు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత పొందారు. ఆరేళ్ల ఇంటి గ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్‌ ఐటీకి వెయ్యి సీట్ల చొప్పున నాలుగు వేల సీట్లను కేటాయించారు. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా మారిన ట్రీపుల్‌ ఐటీల్లో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గ్రామీణ, పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు మక్కువ చూపుతున్నారు.

ఈ నెల 20వ తేదీ వరకు

దరఖాస్తుకు గడువు

ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు గత నెల 24వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల కాగా 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్‌ 6వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్‌ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. స్పెషల్‌ కేటగిరి( పీహెచ్‌సీ/క్యాప్‌/ ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌/భారత్‌స్కాట్స్‌) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహించనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం జూలై మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.

ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసిన

దివంగత సీఎం వైఎస్సార్‌

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇడుపులపాయ, నూజివీడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కో కళాశాలకు 2 వేల సీట్లను కేటాయించగా తర్వాతి ప్రభుత్వాలు 2010 నుంచి ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాల తెలంగాణాకు వెళ్లిపోవడంతో 2016వ సంవత్సరం నుంచి ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. వీటిలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు కేటాయించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4 వేల సీట్లలో ఓపెన్‌ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను ఉమ్మడి జిల్లాల వారికి సమానంగా పంచనున్నారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్‌ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ. 200, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఓసీ విద్యార్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంది.

పేద విద్యార్థుల చదువుకు భరోసా

గత ప్రభుత్వ చర్యలతో ఉత్తమ

ఫలితాలు సాధించిన విద్యార్థులు

జిల్లాలో 456 ప్రభుత్వ పాఠశాలలు

ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసిన

దివంగత సీఎం వైఎస్సార్‌

పదవ తరగతి మార్కుల ఆధారంగా

విద్యార్థుల ఎంపిక

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

నాలుగు శాతం డిప్రివేషన్‌ స్కోరు

మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేది: మే 20 ఎంపికై న అభ్యర్థుల జాబితా విడుదల: జూన్‌ 6

సర్టిఫికెట్ల పరిశీలన: జూన్‌ 11 నుంచి 17 వరకు

ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు: మే 28 నుంచి 31 వరకు

ఏపీలో ట్రిపుల్‌ ఐటీ కాలేజీలు: ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం

మొత్తం సీట్లు: 4వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement