
సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సాధారణ భక్తులకు శీఘ్రదర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే మహా నివేదన సమయంలో వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం ఈవో శీనానాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించి 15 రోజులైందని, ఇప్పటికే ఆలయ వ్యవహారాలను క్షుణంగా పరిశీలించానని, ఇంకా అనేక విషయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ వారికి అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడటంతో పాటు శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించే సమయంలో రద్దీ అధికమవుతోందని గుర్తించి, ఆ సమయంలో వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇక ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దసరా నాటికి ఓ కొలిక్కి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అన్నదాన భవనం, లడ్డూ పోటులను ఉత్సవాలకు సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే పూర్తయిన పూజామండపం, రాతి యాగశాలను శ్రావణ మాసం నుంచి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. కొండపైన, కొండ దిగువన పార్కింగ్ ప్రాంతం తక్కువగా ఉండటంతో రద్దీ సమయాల్లో భక్తులు తమ వాహనాలను వీఎంసీ కార్యాలయం వద్ద నాలుగు ఎకరాల హోల్డింగ్ ఏరియాతో పాటు రెండు ఎకరాల టీటీడీ స్థలం, పున్నమి ఘాట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి దేవస్థానం బస్సులను నడుపుతుందన్నారు.
3 నుంచి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట
జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పూజా కార్యక్రమాలు, జపాలు జరుగుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ఈఈ కోటేశ్వరరావు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు
దసరా నాటికి లడ్డూ పోటు,
అన్నదాన భవనాలు
మీడియాతో దుర్గగుడి ఈవో శీనానాయక్