
డీఎస్సీ అభ్యర్థులెవరూ సంతృప్తిగా లేరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ అభ్యర్థులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, మానసిక అశాంతితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాని కోరుతూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో లక్ష్మణరావు మాట్లాడుతూ.. పరీక్షకు సన్నద్ధమవడా నికి 45 రోజులు సమయం చాలదని, 90 రోజులు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో జిల్లాకో పేపర్ విధానం అమలు చేయాలని కోరారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికి న్యాయం చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్ పరీక్షను రద్దుచేసి ఆఫ్‌లైన్‌లో పెట్టాలని, పీఈటీ పోస్టులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు