
రసాయనాలతో మగ్గించిన పండ్లతో ముప్పు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాల్షియం కార్బైడ్ తదితర హానికర, నిషేధిత రసాయనాలతో మగ్గబెట్టిన పండ్ల వలన ప్రజారోగ్యానికి పెనుముప్పు ఏర్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తొందరగా పాడయ్యేందుకు అవకాశమున్న పండ్లను మగ్గబెట్టడానికి నిషేధిత రసాయనాలు వాడకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. వరిగడ్డి వంటి వాటిలో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని, హానికర రసాయనాలు వాడితే ఆర్సినిక్, ఫాస్ఫరస్ అవశేషాలతో చర్మ రోగాలు, గొంతు సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కార్బైడ్ ఉపయోగించి మగ్గబెట్టిన పండ్లపై నల్లని మచ్చలుంటాయని వివరించారు. బాగా కడిగి తినేలా అవగాహన కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు నున్న, కేదారేశ్వరపేట వంటి మార్కెట్లలో ఆహార భద్రత, మునిసిపల్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని, శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. నిషేధిత రసాయనాలు వాడినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా కార్బైడ్, నిషేధిత రసాయనాలు ఉపయోస్తే ఆ విషయాన్ని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నంబరు 94403 79755కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఆహార భద్రత అధికారి, కమిటీ సభ్య కన్వీనర్ ఎన్.పూర్ణచంద్రరావు, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్, జిల్లా అగ్రీ ట్రేడ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, గజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రమేష్‌బాబు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత రసాయనాలు వాడినట్లు రుజువైతే క్రిమినల్ కేసు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ