
అంతర్ రాష్ట్ర బైక్ చోరీ ముఠాకు చెక్!
కంకిపాడు: బైక్‌ల చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠాకు చెక్ పడింది. ఇద్దరు కీలక నిందితులను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా చోరీ చేసిన 50 బైక్‌లను ఇప్పటికే పోలీసులు రికవరీ చేసి పోలీసుస్టేషన్‌కు కూడా తరలించారు. వివరాల్లోకి వెళితే...
ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలు అధికమయ్యాయి. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఈడుపుగల్లు పరిసరాల్లో సుమారు 5 మోటరు బైక్‌లు చోరీ అయ్యాయి. దీనిపై కంకిపాడు పోలీసులు లోతైన దర్యాప్తు సాగించారు. సీసీ ఫుటేజ్‌లను సేకరించి, వారి కదలికలను, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమైన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
కదిలిన డొంక...
బైక్ చోరీలకు పాల్పడే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగించటంతో డొంక కదిలింది. ఈ ఇద్దరు నిందితులు ఎంతో చాకచక్యంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని అనేక చోట్ల ఈ ముఠా బైక్ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ బైక్‌లను కుదువ పెట్టింది?, విక్రయించిందీ? తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే 50 బైక్‌లను పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నిందితులను నేడు లేదా రేపు అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఇప్పటికే 50 బైక్‌ల స్వాధీనం