
‘ఉపాధి’ కూలీలకు 80 లక్షల పని దినాలు లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం: ఉపాధి హామీ పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది కూలీలకు 80 లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అమృత సరోవర్ పనులను పరిశీలించారు. ఉపాధి పనులు అత్యంత నాణ్యతగా, పారదర్శకంగా జరగాల న్నారు. ఇప్పటి వరకు 25 వేల పనిదినాలు కల్పించామన్నారు. ప్రతి కూలీకి రూ.307 దినసరి కూలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలు తెల్లవారుజామున పని ప్రదేశానికి చేరు కుని ఉదయం పది గంటలకు పని ముగించి ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ పలుగు చేతబట్టి కూలీలతో పాటు మట్టిని తవ్వారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధిహామీ పీడీ ఎ.రాము, ఏపీఓ ప్రమీల, పంచాయతీ కార్యదర్శి మునేశ్వరరావు పాల్గొన్నారు.