
అడ్డగోలుగా అడ్వాన్స్ తరగతులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను హింసిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లో ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడటమే కాక, ఆయా విద్యాసంస్థల ఒత్తిడితో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి నెలలో పరీక్షలు నిర్వహించింది. ఏప్రిల్ లో ఫలితాలను ప్రకటించింది. బోర్డు తమ పరిధిలోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులను ప్రకటించింది. కానీ కార్పొరేట్ సెక్టార్‌లోని అత్యధిక విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా తరగతులను కొనసాగిస్తున్నాయి.
ఆనవాయితీకి భిన్నంగా షెడ్యూల్
ప్రతి ఏటా వార్షిక పరీక్షలు పూర్తవగానే విద్యార్థులకు సెలవులు ప్రకటించటం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తరువాత ద్వితీయ సంవత్సరం తరగతులను వెంటనే మొదలు పెట్టే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. వారికి ఈ నెల 23వ తేదీ వరకూ తరగతులను నిర్వహించి, 24వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే ఇంటర్మీడియెట్ మొదటి ఏడాదికి అడ్మిషన్లు నిర్వహించే విధంగా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇవన్నీ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లంటూ విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. అదే రీతిలో సెలవులు ప్రకటించినప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చాలా విద్యాసంస్థలు విద్యార్థులకు యథావిధిగా తరగతులను కొన సాగిస్తున్నాయి.
ప్రవేశ పరీక్షల పేరుతో క్లాసులు
కార్పొరేట్ విద్యాసంస్థలు నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షల పేరుతో ఈ తరగతులను కొనసాగిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. అది కూడా ఆయా కోర్సులకు వెళ్లే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారికి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలోకి వచ్చిన వారికి సైతం సెలవులు ఇవ్వకుండా ప్రవేశ పరీక్షల పేరుతో యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సైతం కొన్ని విద్యాసంస్థలు బ్రిడ్జి కోర్సులని, మ్యాథ్స్ అవగాహన తరగతులంటూ ప్రత్యేకంగా తరగతులను కొనసాగిస్తున్నాయి.
ఒత్తిడి సరికాదంటున్న నిపుణులు
సాధారణంగా వార్షిక పరీక్షలు పూర్తయిన తరువాత ఆ విద్యార్థిపై అప్పటి వరకూ కొనసాగిన ఒత్తిడిని నివారించేందుకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించటం పరిపాటి. వేసవి ఎండల్లో సెలవుల పేరుతో వారిని కొద్ది రోజులు ఇళ్లకు పరిమితం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎటువంటి సెల వులు లేకుండా తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెట్టే విధంగా తరగతులు నిర్వహించటం వలన విద్యార్థులు మానసికంగా తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యే ప్రమాదముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
కార్పొరేట్ సంస్థలతో పాటుగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తుంటే సంబంధిత అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలలతో పాటుగా నగరం నడిబొడ్డున ఉన్న పలు విద్యాసంస్థలు తరగతులను నిర్వహిస్తున్నాయి. తరగతులు నిర్వహిస్తున్న సమాచారం ఉన్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులకు సెలవులిచ్చినా యథేచ్ఛగా తరగతులు ప్రవేశ పరీక్షల పేరుతో సెకండియర్ విద్యార్థులకు క్లాసులు బ్రిడ్జి కోర్సులంటూ ఇంటర్ ఫస్టియర్ తరగతులు బరితెగిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
కొన్ని విద్యాసంస్థలు నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు తరగతులను నిర్వహిస్తున్నాయి. వారికి కాకుండా ఇతరులకు తరగతులు నిర్వహిస్తే అది నిబంధనలకు విరుద్ధం. అటువంటి విద్యాసంస్థలపై తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. దీనిపై నిఘా ఉంచుతాం.
– ప్రభాకరరావు, ఆర్‌ఐవో, ఎన్టీఆర్ జిల్లా