అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది? | - | Sakshi
Sakshi News home page

అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది?

May 4 2025 6:33 AM | Updated on May 5 2025 10:26 AM

అక్రమ

అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది?

జగ్గయ్యపేట: ఇసుక, గ్రావెల్‌, బియ్యం అక్రమంగా రవాణ చేస్తే సహించేది లేదంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొందరు అక్రమార్కులు పగలూ, రాత్రి తేడా లేకుండా ఏపీ నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక, గ్రావెల్‌, బియ్యం రవాణా చేస్తూ పోలీసు, చెక్‌పోస్టు అధికారులకు పనితీరును ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటు కేవలం అలంకారప్రాయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండు అంతఃరాష్ట్ర చెక్‌పోస్టులు...

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట మండలం గరికపాడు, తిరువూరు మండలం ముత్తగూడెం వద్ద అంతఃరాష్ట్ర చెక్‌పోస్టులు ఉండగా ప్రస్తుతం గరికపాడు చెక్‌పోస్టు మాత్రమే పనిచేస్తోంది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 13 గ్రామాల్లో సరిహద్దు చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలోని చెక్‌పోస్టులు పూర్తిగా పని చేయడం లేదు.

అక్రమ రవాణాతో ధ్వంసమవుతున్న రోడ్లు...

ముఖ్యంగా గరికపాడు అంతఃరాష్ట్ర చెక్‌పోస్టు ఉన్నప్పటికి హైదరాబాద్‌ నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు వారంలో మూడురోజులు తెల్లవారుజామున 5 నుంచి 20 లారీలకు పైగా కృష్ణాజిల్లాలోని పలు చేపల చెరువులకు వెళ్తుంటాయి. ఈ నిషేధిత వాహనాలు సరిహద్దు దాటడంలో జగ్గయ్యపేట సర్కిల్‌లోని కొందరు పోలీసుల అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇక కాకినాడ పోర్టు వద్ద రేషన్‌బియ్యం రవాణా నిలిపివేయడంతో అక్రమార్కులు లారీల ద్వారా బియ్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టు తనిఖీలు తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల మీదుగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఇలా ఇసుక, బియ్యం, గ్రావెల్‌తో వెళ్లే భారీ వాహనాల కారణంగా తమ గ్రామంలోని రోడ్లు దెబ్బతింటున్నాయంటూ జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామస్థులు ఇటీవల నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కూడా మొరపెట్టుకోవడం గమనార్హం.

నామమాత్రంగా తనిఖీలు...

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది నామమాత్రపు తనిఖీలకు పరిమితమవుతుండటంతో అక్రమార్కులు వారి కళ్లుగప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఉదయం సమయాల్లో పాలేరు, మునేరు, కృష్ణానది నుంచి ఇసుకను తీసుకువచ్చి వారికి అనుకూలమైన ప్రదేశాలలో డంపింగ్‌ చేస్తూ, పది ట్రాక్టర్లు సరిపడా ఇసుక రాగానే రూట్‌ మ్యాప్‌ మేరకు తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో పోలీస్‌ సిబ్బంది ప్రశ్నిస్తే సమీపంలోని పలు గ్రామా ల్లో కర్మాగారాల్లో నిర్మాణాల కోసమంటూ మాస్కా కొడుతున్నారు. ఇలా ముక్త్యాల, రామచంద్రునిపేట, మల్కాపురం, అన్నవరం, వత్సవాయి మండలం పోలంపల్లి, తాళ్ళూరు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మధిర ఇసుక భారీగా తరలివెళ్తోంది. గత నెల 25న ముక్త్యాల చెక్‌పోస్టు మీదుగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంనకు చెక్‌పోస్టు కానిస్టేబుల్‌ సహకారంతో ఇసుక ట్రాక్టర్‌ను తరలిస్తుండగా గ్రామంలోని యువకులు అడ్డుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను మందలించి అతన్ని చెక్‌పోస్టు విధుల నుంచి తొలగించారు. చందర్లపాడు మండలం కాసరాబాద్‌, కంచికచర్ల మండలం వేములపల్లి ఇసుక రీచ్‌ల నుంచి గరికపాడు చెక్‌పోస్టు మీదుగా రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు నిత్యం ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయి. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతుండటం గమనార్హం. ఇకనైనా జిల్లా పోలీసు, తనిఖీ విభాగాల అధికారులు స్పందించి ఈ ఇసుక, గ్రావెల్‌, బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

నామమాత్రంగా చెక్‌పోస్టులు

నిద్రనటిస్తున్న ఉన్నతాధికారులు

అక్రమార్కులకు స్థానిక పోలీసుల అండ దండలు

తెలంగాణకు జోరుగా ఇసుక, గ్రావెల్‌, బియ్యం అక్రమ తరలింపు

కూటమి నేతల సహకారంతోనే..

జిల్లా వ్యాప్తంగా ఆయా సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నప్పటికి దర్జాగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక, గ్రావెల్‌, బియ్యం తరలిపోతుండటం గమనార్హం. అక్రమార్కులకు అధికారపార్టీ నాయకుల పూర్తి అండదండలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమరవాణాను సాగిస్తున్నారు.ముఖ్యంగా వత్సవాయి, తాళ్ళూ రు, పోలంపల్లి, ముక్త్యాల, అన్నవరం, బూదవాడ, జొన్నలగడ్డ, పెద్దాపురం సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి ఉచితం పేరుతో ఇసుక తెలంగాణకు తరలిపోతుంది. అంతేకాకుండా తెలంగాణలోని సూర్యపేట నుంచి రామా పురం క్రాస్‌రోడ్డు వరకు 69వ నంబర్‌ జాతీయ రహదారి ఆరు లైన్ల రహదారిగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ ప్రాంతం నుంచే గ్రావెల్‌ను ఇష్టానుసారంగా తరలిస్తున్నారు.

అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది? 1
1/1

అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement