
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం
పెనుగంచిప్రోలు: ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది పెనుగంచిప్రోలు. పవిత్ర కార్తికంలో పరమేశ్వరుడి దర్శనం, ఆలయాల సందర్శన, వన భోజనాలు ప్రాధాన్యమిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, అన్ని వర్గాల వారు ఏటా కార్తిక మాసంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మునేరు అవతల ఉన్న మామిడితోటల్లో వన సమారాధనలు నిర్వహించుకుంటారు. గ్రామంలో ప్రసిద్ధి చెందిన తిరుపతమ్మ ఆలయం, పవిత్ర స్నానాలు చేసేందుకు ఆలయం పక్కనే మునేరు, సామూహికంగా భోజనాలు చేసేందుకు, ఆటపాటలు పాడేందుకు మునేరుకు ఆనుకొని అందమైన మామిడి తోటలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. విజయవాడకు 60 కిలోమీటర్లు, నందిగామ, జగ్గయ్యపేట పట్టణాల నుంచి 17 కిలోమీటర్ల దూరంలో పెనుగంచిప్రోలు గ్రామం ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆహ్లాదం వాతావరణంతో పుణ్యక్షేత్రం ప్రసిద్ధికెక్కింది.
ఆహ్లాదాన్ని పంచే మామిడి తోటలు
మునేరు అవతల ఉన్న మామిడి తోటలు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. మామిడి తోటల్లో పలు రకాల ఆట, పాటలతో సరదాగా గడపవచ్చు. సామూహికంగా వన సమారాధనలు నిర్వహించుకోవచ్చు. ఉసిరి చెట్టు కింద కార్తిక మాస వ్రతాలు, కథలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంటారు. మామిడి తోటలు పక్కనే ప్రవహిస్తున్న మునేరులో వన సమారాధనలకు వచ్చేవారు పవిత్ర స్నానాలు చేయడం, సరదాగా గడుపుతారు. ముఖ్యంగా కార్తికంలోని సెలవు దినాల్లో వేల సంఖ్యలో సందర్శకులు గ్రామంలో వన సమారాధనలకు హాజరవుతారు. తక్కువ ఖర్చుతో ఆనందం, ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికత ఇక్కడ లభిస్తుంది.
వన సమారాధనలకు అనువైన పవిత్ర పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యోగులు, యువత సందర్శకుల సందడి
శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం
జిల్లాలో శ్రీకనకదుర్గమ్మ ఆలయం తర్వాత రెండవ స్థానంలో ఉన్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు. ఆలయ ప్రాంగణంతో ఎంతో విశాలంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆలయంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఆలయం చుట్టూ, ముందు పచ్చని గార్డెన్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.