కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్నకు చెబుదాం, రీ–సర్వే, గృహనిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజాబాబు జిల్లాప్రగతిని సీఎస్‌కు వివరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902 కాల్‌సెంటర్‌కు వచ్చిన గ్రీవెన్స్‌కు పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు 1,276 సమస్యలు నమోదు కాగా వీటిలో 692 సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించామన్నారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కు పత్రాలను అందజేశామన్నారు. 38,675 పత్రాలను యజమానులకు అందించామని తెలిపారు. గృహ నిర్మాణానికి సంబంధించి గత రెండు వారాలుగా వివిధ దశల్లో ఉన్న గృహాలు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. 15,324 గృహాలు పూర్తి కాగా 8,782 గృహాలు 63 శాతం లక్ష్యసాధనలో ఉన్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డీపీవో నాగేశ్వరనాయక్, డీఆర్డీఏ పీడీ పీఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.