
మహిళల చిరునవ్వులే ఆశీర్వాదాలు
● అందుకే అన్ని పథకాలు అతివల పేరుతోనే... ● ‘మహాలక్ష్మి’ సంబురాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల చిరునవ్వులే తమ ప్రభుత్వానికి ఆశీర్వాదాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సంబురాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి నుంచి ఉచిత ప్రయాణంపై అభిప్రాయాలు కోరగా మహిళలు అనిత, జ్యోతి, విద్యార్థిని శ్వేత మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు సగటును రూ.3 వేల వరకు ఆదా అవుతున్నాయని తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలోనే 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. చిరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఇది ఎంతో ఉయోగపడుతోందని చెప్పారు. అలాగే, గ్యాస్ సిలిండర్ రాయితీ ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు మహిళల పేరిటే ఇస్తున్నామని తెలిపారు. కాగా, ఖమ్మంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుండగా, హైదరాబాద్‌కు దీటుగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ చిరుద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులకు ఉచిత ప్రయాణంతో డబ్బు ఆదా అయి కుటుంబం ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి
రఘునాథపాలెం మండలం మూలగూడెం గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటుచేసిన బస్సు సర్వీస్‌ను ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద మంత్రి తుమ్మ ల ప్రారంభించారు. ఈక్రమాన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పలువురు మహిళలతో కలిసి టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల కొద్దిదూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్, డిపో మేనేజర్ దినేష్‌కుమార్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.

మహిళల చిరునవ్వులే ఆశీర్వాదాలు