● బీజేపీ నాయకులు విజయేంద్ర, అశోక్, రాధామోహన్‌దాస్‌లకు హైకమాండ్ పిలుపు
శివాజీనగర: కర్ణాటక విధాన పరిషత్‌లో 7 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కుదుపునకు దారి తీశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యత ప్రదర్శించాల్సిన బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినాయకత్వాలకు షాకిచ్చి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రస్తుతం మిత్రుల మధ్య క్రాస్ ఓటింగ్ నెంబర్ వివాదానికి దారి తీసింది. మరోవైపు క్రాస్ ఓటింగ్‌ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి రాధామోహన్‌దాస్‌లకు వెంటనే ఢిల్లీకి రావాలని కబురంపింది.
నాయకులను కలుస్తున్న ఎమ్మెల్యేలు
క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ నాయకులను భేటీ చేస్తున్నారు. భైరతి బసవరాజ్, చంద్రు లమాణి, కృష్ణ నాయక్‌లపై క్రాస్ ఓటింగ్ ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యేలందరూ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులను కలిసి వివరణ ఇచ్చారు. పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి స్పందిస్తూ తాము నిర్ధారించిన నాలుగు ఓట్లు జేడీఎస్‌కు పడ్డాయి. తమ నివేదిక వచ్చేవరకు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయం. ఆ తరువాత తామే క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. మొత్తం మీద పరిషత్ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ మిత్ర పక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ల్లో వణుకు పుట్టించింది.
క్రాస్ ఓటింగ్‌పై సత్యశోధన
విధాన పరిషత్ ఎన్నికల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగినందున అతి తక్కువ తేడాలో పరాజయం తప్పించుకున్న కర్ణాటక బీజేపీ క్రాస్ ఓటింగ్ విషయంపై సత్యశోధన కమిటీని నియమించింది. విధాన పరిషత్ సభ్యుడు సీ.టీ.రవి నేతృత్వంలో కమిటీని నియమించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్, ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయిలతో కూడిన త్రిసభ్య కమిటీకి జూన్ 25లోగా నివేదిక ఇవ్వాలని అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సూచించారు. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురై పారిపోయేవాడని కాదు. దీనిని ఓర్చుకునే శక్తి తనకుందన్నారు. తాను యడియూరప్ప కుమారుడిని. క్రాస్ ఓటింగ్ గురించి ఎవరితో చెప్పాలో వారికి చెబుతానన్నారు.
భగవంత్ ఖూబా లేఖ
బీజేపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రకు కేంద్ర మాజీ మంత్రి భగవంత ఖూబా లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీంతో పరిషత్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎన్నో చోట్ల ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ముందు సూచన చేసినా కార్యకర్తలు పార్టీ తరఫున పని చేయకుండా దూరంగా ఉంటున్నారు. సొమ్ము ఇచ్చి ప్రజలను తీసుకొచ్చి కార్యకర్తలుగా ప్రతిబింబించే పని జరుగుతున్నా కూడా ఇలాంటిదేమీ ప్రశ్నించటం లేదని లేఖలో ఉల్లేఖించారు. 2028లో పార్టీ అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఖూబా తన రహస్య లేఖలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు కూడా ఈ విషయమై విన్నవించారు.
గుండెపోటుతో ఏఆర్ ఎస్‌ఐ మృతి
తుమకూరు: ఏఆర్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కొరటగెరె తాలూకా తుంబుగనహళ్లి సమీపంలో 12వ కె.ఎస్.ఆర్.పి యూనిట్‌లో జరిగింది. బాగలకోటె జిల్లా బీళగికి చెందిన ఎన్‌జీ పవార్ ఇక్కడి బెటాలియన్‌లో నాలుగేళ్లుగా ఎఆర్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్‌లో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. కొరటగెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బెటాలియన్ కమాండర్ హమ్జా హుస్సేన్, డిప్యూటీ కమాండర్ నిసార్ అహ్మద్ తుది నివాళులర్పించారు.


