బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పంచ గ్యారంటీ పథకాలు పొందడానికి రాష్ట్రంలో ఓటుహక్కు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. గురువారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఓటుహక్కు కలిగిన ప్రజలకు మాత్రమే ప్రభుత్వ సౌలభ్యాలు అందించాలనేది నా నిర్ణయం. ఓటుహక్కు లేదంటే ఎందుకు గ్యారంటీ పథకాలు ఇవ్వాలి?, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. ప్రభుత్వ సౌలభ్యాలు పొందేవారికి ఓటు హక్కు మరీ ముఖ్యం’ అని చెప్పారు.
ఉచిత బస్సుకు ఐడీ కార్డు
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కోసం సరైన గుర్తింపు కార్డు అందిస్తామని సీఎం చెప్పారు. గ్యారంటీ పథకాల అర్హుల గురించి ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ పరిశీలన సహాయపడుతుందన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని మరోసారి సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అక్రమంగా పంచ గ్యారంటీలను పొందుతున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
లేనివారికి ఎందుకివ్వాలి: సీఎం శివ


