కేబినెట్‌లో రహీంఖాన్‌కు చోటు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లో రహీంఖాన్‌కు చోటు ఇవ్వాలి

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌లో మంత్రిగా రహీంఖాన్‌ని నియమించాలని అఖిల భారత మైనార్టీ సేవా సంఘం ఒత్తిడి చేసింది. అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు సాధిక్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్యమంత్రిని మార్పు చేసిన సమయంలో ఆ పదవిని మైనార్టీలకు కేటాయించాలన్నారు. 2023 ఎన్నికల సమయంలో కళ్యాణ కర్ణాటక భాగంలో మైనార్టీల ఓట్లు కావాలని ప్రధాన పదవులు మాత్రం అగ్రనాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిని రహీంఖాన్‌కి తిరిగి కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

హొసపేటె: ఆహారం కోసం వెతుకుతున్న ఒక చిరుత జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన బుధవారం రాత్రి సుమారు 10:30 గంటలకు విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దులోని హులికుంటె క్రాస్‌ సమీపంలో జాతీయ రహదారి– 50పై జరిగింది. సుమారు రెండున్నర సంవత్సరాల వయస్సుగల మగ చిరుత చనిపోయింది. ప్రమాదంలో చిరుత నోరు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో చిరుత అక్కడికక్కడే మరణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. విషయం తెలియగానే హొసపేటె ఫారెస్ట్‌ జోన్‌ ఆఫీసర్‌ కౌశిక్‌, కూడ్లిగి ఎస్‌ఐ ప్రకాష్‌, ఇతర సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు.

మహిళ అదృశ్యం

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆలూరు గ్రామానికి చెందిన సుమారు 25 ఏళ్ల వయస్సున్న శృతి అనే మహిళ అదృశ్యమయ్యారు. ఈ విషయంపై హొసహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదృశ్యమైన మహిళ సుమారు 5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీర ఛాయ, గుండ్రని ముఖం కలిగి కన్నడలో మాట్లాడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆమె ఆకుపచ్చ రంగు నైటీ ధరించింది. ఆమె ఆచూకీపై ఏమైనా సమాచారం తెలిస్తే హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని స్టేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీ బస్‌ ఢీకొని

గొర్రెల కాపరి దుర్మరణం

మూడు గొర్రెలూ మృతి

సింధనూరు వద్ద దుర్ఘటన

రాయచూరు రూరల్‌ : కేకేఆర్టీసీ బస్సు ఢీకొని గొర్రెలు కాపరితో పాటు మూడు గొర్రెలు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సింధనూరు వద్ద గంగావతి రోడ్డులో ఈ ఘటన జరిగింది. మృతుడిని మస్కి తాలూకా హాలాపూర్‌కు చెందిన గొర్రెల కాపరి శరణప్ప(36)గా గుర్తించారు. సింధనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు.

లోకాయుక్త వలలో విద్యాశాఖ క్లర్క్‌

రాయచూరు రూరల్‌: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్లర్క్‌ మహాబళేఽశ్వర్‌ లోకాయుక్త వలలో చిక్కారు. గురువారం లోకాయుక్త ఎస్పీ సతీష్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు. పాఠశాలను రెన్యూవల్‌ చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నగర పరిధిలోని రాంపూర్‌ ప్రైవేట్‌ పాఠశాల లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం యజమాని సిద్దణ్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేయగా మహాబళేశ్వర్‌ లోకాయుక్త అధికారుల చేతికి దొరికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement