● యజమానిపై ఫిర్యాదు
బనశంకరి: బాలునిపై రాట్‌వీలర్ శునకం దాడిచేసిన ఘటన బెంగళూరు మహదేవపురలో జరిగింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 ఏళ్ల బాలుడు సైకిల్‌పై వెళుతుండగా, శ్యామ్ అనే వ్యక్తికి చెందిన రాట్‌వీలర్ జాతి కుక్క బాలున్ని వెంటాడి తొడ భాగంపై కరిచింది. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్దానికులు చేరుకుని కుక్కను దూరంగా తరిమి బాలుడిని కాపాడారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు. బాలుని తండ్రి విపిన్, కుక్క యజమాని శ్యామ్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడే కుక్కను రెచ్చగొట్టాడని యజమాని దబాయించాడన్నారు. కాగా, రాట్‌వీలర్ కుక్క దుందుడుకుగా దాడులు చేస్తుందని అనేక దేశాలలో దానిని పెంచుకోవడాన్ని నిషేధించారు.
బెడ్‌పై బొమ్మకు దుప్పటి కప్పి..
బనశంకరి: సినిమాలలో హీరోయిన్‌లు చేసిన మాదిరిగా, బెడ్‌పై బొమ్మను నిద్రపోయినట్లు అమర్చి యువతి ఇంట్లో నుంచి పరారైంది. ఈ ఘటన చిక్కమగళూరు కొప్ప తాలూకా కుంచూరు గ్రామంలో జరిగింది. విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజనీర్ జగదీశ్ కుమార్తె జలన్య ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ క్లాస్‌కు వెళుతోంది. ఇటీవల తండ్రి తో కలిసి శృంగేరి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. కానీ మరుసటి రోజున బెడ్ మీద బొమ్మకు దుప్పటి కప్పి, అక్కడ తాను ఉన్నట్లుగా సీన్ రూపొందించి, వెళ్లిపోయిందని తండ్రి హరిహరపుర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కుమార్తె నిద్రపోతోందని, మధ్యాహ్నమైనా నిద్ర లేవలేదని వెళ్లి చూస్తే బొమ్మను చూసి షాక్ తిన్నట్లు తెలిపాడు. యువతి రహస్యంగా మొబైల్‌ఫోన్ వాడుతున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా పరిచయాలతోనే వెళ్లిపోయినట్లు అనుమానాలున్నాయి.
మహిళ పేరుతో
రూ.15 లక్షల రుణం
● కొత్త రకం సైబర్ మోసం
యశవంతపుర: స్మార్ట్‌ఫోన్ సిమ్‌ని 4జి నుంచి 5జికి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసిస్తానని నమ్మించి సైబర్ నేరగాడు మహిళ మీద రూ.15 లక్షల అప్పు వేసేసిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. విక్టోరియా లేఔట్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ నెల 13న మధ్యాహ్నం 3గంటలకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికాం కంపెనీ ఉద్యోగినని చెప్పాడు. మీ మొబైల్ సిమ్‌ను 4జి నుంచి 5జి కి అప్‌గ్రేడ్ చేయాలని చెప్పి పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితరాల వివరాలను తీసుకున్నాడు. చివరగా ఓటీపీ వస్తుందని చెప్పి అది తెలుసుకున్నాడు. ఇలా 30 నిముషాలలో ఆమె పేరుతో రూ.15 లక్షల ఆన్‌లైన్ రుణాన్ని మోసగాడు తీసుకున్నాడు. కొంతసేపటికి రుణం వివరాలు ఆమె ఫోన్‌కు వచ్చాయి, దీంతో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుండెపోటుతో
బాలుడు మృత్యువాత
దొడ్డబళ్లాపురం: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు.
ఒకటో తరగతి చిన్నారి
ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్‌లెట్‌కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది.


