కోలారు: ముళబాగిలు నగరంలోని పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ద శ్రీ ఆది హనుమంతరాయ దేవాలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపుర మహా సంప్రోక్షణ సందర్భంగా బుధవారం దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాతసేవ, గోపురంపై రత్న న్యాసపూర్వక కళశస్థాపన, విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహం, కుంభారాధన, విశేష హోమాలు సాగాయి. హనుమంతరాయుని మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూల అలంకరణ చేశారు. భజన గీతాలు భక్తులను అలరించాయి.
స్నేహితులకు చెప్పి..
ఎస్‌ఐ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్‌బీ విభాగంలో ఎస్సైగా పని చేస్తున్న బసవరాజు హేరూర్ (35) ఆత్మహత్య చేసుకున్నారు. 2014 బ్యాచ్ ఎస్సై అయిన బసవరాజు కలబుర్గిలోని గంగా నగరలో ఉన్న తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. ఘటనకు ముందు బసవరాజు తన స్నేహితులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వారు వెంటనే బసవరాజు తండ్రికి కాల్ చేసి తెలిపారు. తండ్రి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. బసవరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. రాఘవేంద్రనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సమస్యలా, ఉద్యోగంలో ఇబ్బందులా అనేది తేలాల్సి ఉంది. డెత్‌నోట్ ఏదీ దొరకలేదని తెలిసింది.
సహజీవన ప్రియురాలి హతం
● బెంగళూరులో ఘోరం
యశవంతపుర: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్‌స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు.


