
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన దరిమిలా.. ప్రభుత్వం వేలాది మంది లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయగానే.. ఇంటి నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది.
ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం...
ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. అందులోనూ కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికాదు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపైనా తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు ధరాభారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది.
జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్‌మెంట్ స్లాబ్‌లెవల్
దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి
కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129
జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30
పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42
రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90
మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291
సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది
కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200
కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000
ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000
ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000
మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200

ఇందిరమ్మపై ధరాభారం!