
సీనియర్ సిటిజన్లే టార్గెట్
● రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు ● సీబీఐ పేరుతో వీడియోకాల్స్ బెదిరింపులు ● యువతుల పేర్లతో సొమ్ము దోచుకుంటున్న వైనం ● భారీగా మోసపోతున్న బాధితులు
‘మంచిర్యాల జిల్లా లక్షటిపేట్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్‌ను సైబర్‌నేరగాళ్లు భారీగా మోసం చేశారు. మీ అమ్మాయి ఓ కేసులో పట్టుబడిందని సీబీఐ పేరుతో వీడియోకాల్స్ చేసి సీబీఐ లోగోతో వార్ రూం సృష్టించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లవద్దు. మీపై సీబీఐ నిఘా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్‌లో కన్పించి నమ్మేలా చేశారు. భారీ మొత్తం అకౌంట్‌లో వేయాలని, లేకుంటే కుటుంబం మొత్తం కేసులో ఇరుక్కుంటారని చెప్పి రూ.1.70కోట్లు దండుకున్నారు. మొత్తం చెల్లించాక బాధితుడు మోసపోయామని గ్రహించి రామగుండం సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు’.
‘స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభం వస్తుందని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ముందుగా రూ.10వేలు లాభం చూపించారు. తర్వాత వాట్సాప్‌లో లింక్‌లు ఇచ్చి దాన్ని క్లిక్ చేయమని లాభాలు చూపిస్తూ రూ.1.40కోట్ల వరకు మోసం చేశారు. తాను పెద్దమొత్తంలో మోసపోయాయని భావించి బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు’.
గోదావరిఖని(రామగుండం): అమాయకత్వం, అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశ పెద్ద మొత్తంలో నష్టపోయేలా చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి లావాదేవీలు, ఇతర వ్యాపకాలను గమనించి వారి కుటుంబ సభ్యుల ఫొటోలు సేకరించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్షట్టిపేట్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ భారీగా నష్టపోయాడు. బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి శ్రీమీ అమ్మాయి ఓ కేసులో చిక్కుకుందని ఆమె ఫొటోలను వాట్సప్‌లో షేర్ చేసి వారం నుంచి నెలరోజుల పాటు సీబీఐ ఆఫీసర్ల మాదిరిగా వీడియోకాల్‌లో మాట్లాడుతూ, ఐపీఎస్ ఆఫీసర్ దుస్తుల్లో బెదిరించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలాంటి కొత్తరకం సైబర్ మోసాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. వాట్సప్‌లో లింక్‌లు ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసి అందులో డబ్బులు వేయాలని సూచిస్తున్నారు. ముందుగా పెట్టిన పెట్టుబడికి రూ.10వేల వరకు లాభం చూపించి తర్వాత మోసానికి పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల సెల్‌ఫోన్ నంబర్లు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అలాగే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. క్రిఫ్టోలో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తున్నాయని వారి అకౌంట్‌లో చిన్న పాటి లాభాలు చూపిస్తున్నారు. తర్వాత ఒక్కో వ్యక్తి నుంచి రూ.40లక్షల నుంచి రూ.2కోట్లవరకు మోసం చేశారు. దీంతో పాటు మ్యారేజ్‌బ్యూరో పేరుతో తాము పెళ్లికాని యువతిని అని పరిచయం చేసుకుని కొన్నాళ్లపాటు చాటింగ్ చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్యాప్ ఇచ్చి తాను విదేశాల్లో ఉన్నానని ఈ–మార్కెటింగ్ చేస్తున్నానని ఇందులో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపిస్తున్నారు. వారి మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టి పెద్దమొత్తంలో మోసపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి.
డబ్బులు ఊరికేరావని గమనించాలి
ఆన్‌లైన్‌లో డబ్బులు ఊరికే రావన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. ఆన్‌లైన్ లింక్‌లను క్లిక్‌చేసి మోసపోవద్దు. దీనివల్ల అకౌంట్ డిటేయిల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. ఇటీవల కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఢిల్లీ సీబీఐ ఆఫీసర్‌లమని చెప్పి వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తూ భారీగా సొమ్ము డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ప్రజలు భయపడి మోసపోవద్దు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులు లేదా 1930 నంబర్‌ను సంప్రదించాలి. – వెంకటరమణ,
ఏసీపీ, సైబర్‌క్రైం, రామగుండం

సీనియర్ సిటిజన్లే టార్గెట్