
కూరగాయల సాగుకు అనువైన పరిస్థితులు
జగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయల సాగుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ జిల్లాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో గురువారం జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు, డ్రిప్ కంపెనీలు, ఆయిల్ పాం కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ రెండు జిల్లాల్లో ఎర్రనేలలు ఎక్కువగా ఉండటంతో కూరగాయలతోపాటు పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. మామిడి తోటలకు జగిత్యాల జిల్లా హబ్‌గా ఉన్నందున మామిడిలో దిగుబడి పెంచేలా కృషి చేయాలని కోరారు. రెండు జిల్లాల్లో అరటి తోటల విస్తీర్ణం పడిపోయిందని, ఆ వైపు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున.. వరి సాగు చేసే రైతుల దృష్టిని మరల్చేందుకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రిప్ పరికరాలను సబ్సిడీపై మరింత ఎక్కువ మంది రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఉద్యానశాఖ పథకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానశాఖాధికారులు శ్యాంప్రసాద్, జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.