
జల్సాల కోసం చోరీలు
● పోలీసులకు చిక్కిన ముఠా
● వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ
పెద్దపల్లిరూరల్: జల్సాగా జీవితం గడిపేందుకు సులువుగా సొమ్ము సంపాదించాలని చోరీలకు పాల్పడిన సద్దాం అలీతో పాటు అతడికి సహకరించిన అన్న అన్వర్ అలీ, తల్లి సలీమా, బంధువు మహమ్మద్ సలాంపై కేసు నమోదు చేశామని ఏసీపీ కృష్ణ తెలిపారు. నిందితుడి తల్లి సలీమా పరారీలో ఉండగా సద్దాం, అన్వర్, సలాంను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. గురువారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సద్దాం అలీ 25 మే 2025 రోజున పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో నివాసముండే కొట్టె శ్రీవిద్య ఇంట్లోకి చొరబడి 58 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,260 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లాడు. అదే రోజున గండు అనూష ఇంట్లో 8గ్రాముల బంగారు, 300 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేల నగదు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంగా ఏర్పడి పెద్దపల్లితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన సద్దాం, అతడి తల్లి, సోదరుడు మంచిర్యాలకు మకాం మార్చారు. దొంగిలించిన సొత్తును మంచిర్యాలకు చెందిన బంధువు మహమ్మద్ సలాం సాయంతో అమ్మేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న నిందితుడి తల్లి సలీమా కోసం గాలిస్తున్నట్టు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా దొంగలముఠాను పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్, రమేశ్, నరేశ్‌కుమార్, సనత్‌రెడ్డి, ఏఎస్‌ఐ తిరుపతి, కానిస్టేబుల్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేశ్, శ్రీనివాస్, అనిల్ సతీశ్‌ను డీసీపీ కరుణాకర్, ఏసీపీ అభినందించారు.