విశిష్ట సేవలకు అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

విశిష్ట సేవలకు అరుదైన గౌరవం

Jul 4 2025 4:02 AM | Updated on Jul 4 2025 4:02 AM

విశిష్ట సేవలకు అరుదైన గౌరవం

విశిష్ట సేవలకు అరుదైన గౌరవం

సిరిసిల్ల: మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపు.. వ్యాపారాల్లో రాణించేలా శిక్షణ.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా జావాబుదారీతనం పెంపొందించడంలో ఇల్లంతకుంట మండల సమాఖ్య కృషి ఎనలేనిది. ఏళ్లుగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల సమాఖ్య ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఈ అవార్డు అందుకోనుంది. ఈమేరకు గురువారం ఆహ్వానం అందింది.

46 వీవోలు.. 1103 సంఘాలు

ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య పరిధిలో 46 విలేజ్‌ ఆర్గనైజేషన్‌(వీవో)లు ఉండగా 1,103 స్వయం సహాయక సంఘాలు 11వేలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఆర్థికంగా అండగా.. నిలుస్తూ.. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుంది. గత ఐదేళ్లకు పైగా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ)ల సభ్యులకు రుణాలు అందించడం వాటిని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించేలా చూడడం, సభ్యులకు బీమా కల్పించడం, వివిధ వ్యాపారాల్లో రాణించేలా నిరంతరం శిక్షణ, సలహాలు ఇస్తుంది. సామాజికంగా అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నీటి వనరుల సంరక్షణ ప్లాస్టిక్‌ వినియోగించొద్దని, సైబర్‌ మోసాలకు గురి కావద్దని అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు జీవనోపాధి పెంచే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇల్లంతకుంట మండల సమాఖ్య చేస్తున్న సామాజిక, ఆర్థిక సేవలను గుర్తిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేశారు.

22 క్లస్టర్‌ లెవల్‌ ఫెడరేషన్‌లలో ఎంపిక

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న మండల సమాఖ్యలకు అవార్డులు అందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల సమాఖ్యల పనితీరును పరిశీలిస్తారు. దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మండల సమాఖ్యలను గుర్తించి ఆత్మ నిర్భర్‌ సంఘాతన్‌ అవార్డు–2024 ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు దేశవ్యాప్తంగా 22 మహిళా సంఘాలను ఎంపిక చేసింది. అవార్డులకు దేశంలోని ఆరు రీజియన్ల పరిధిలో 22 క్లస్టర్‌ లెవల్‌ ఫెడరేషన్లు(సీఎల్‌ఎఫ్‌)లు ఎంపికవగా.. సదరన్‌ రీజియన్‌ కింద రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య రెండో స్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద నిర్వహించే అవార్డుల ప్రదాన ఉత్సవానికి ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులను ఆహ్వానించారు. ఈమేరకు ఢిల్లీకి వెళ్లి అవార్డును అందుకోనున్నారు.

అభినందించిన కలెక్టర్‌

ఇల్లంతకుంట మండలం ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలందించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికవడంపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం అభినందనలు తెలిపారు. డీఆర్‌డీవో శేషాద్రి, మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఇల్లంతకుంట మండల సమాఖ్యను ఆదర్శంగా తీసుకుని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఇల్లంతకుంట మండల సమాఖ్యకు జాతీయ అవార్డు

ఆగస్టు 15న ఆత్మ నిర్భర్‌ సంఘాతన్‌ అవార్డు ప్రదానం

అభినందించిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement