
స్మార్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
● హాజరైన తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీ
వేములవాడ: నాలుగు వేదాలు చదివే పాఠశాల వేములవాడలోనే ఉండటం, వేదపండితులకు జాతీయస్థాయిలో స్మార్థ పరీక్షలు రాజన్న సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేదాలను ఇతర దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. రాజన్న ఆశీస్సులతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చేస్తున్నారన్నారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న స్మార్థ పరీక్షల ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరిస్తున్నామని, అభివృద్ధికి మొదటి దశలో రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు గోషాలలో వేములవాడలో ఒకటి ఉందన్నారు. సువిశాలమైన గోశాల నిర్మాణానికి 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ రాజన్న ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ప్రాచీన ప్రాముఖ్యత గల ఆలయమన్నారు. ఆలయ విస్తరణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఈవో రాధాభాయి, అర్చకులు పూర్ణకుంభ కలశంతో ఘనస్వాగతం పలికారు.