
స్వచ్ఛతపై సర్వే షురూ
కరీంనగర్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్– 2025లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితిని పరిశీ లించేందుకు శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు జిల్లాకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సంస్థ నుంచి సూపర్‌వైజర్లు జి.సురేశ్, పి.మధుకర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్లు రాణి, రజిత, అనూష, శిరీషా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. పారిశుధ్య నిర్వహణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీధర్, డీపీవో జగదీశ్వర్ ఉన్నారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు కరీంనగర్ మండలం ఎలబోతారం గ్రామంలో పర్యటించారు. చెత్తసేకరణ, పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. శనివారం జిల్లాలో ఎంపిక చేసిన మరో గ్రామంలో పర్యటించనున్నారు.
జిల్లాలో 20 గ్రామాల్లో సర్వే
జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలుండగా కేంద్రబృందం ఎంపిక చేసుకున్న 20 గ్రామాల్లో సర్వే చేస్తోంది. దాదాపు 20రోజుల పాటు ఆయా గ్రామాల్లో సర్వే కొనసాగుతుంది. సంబంధిత గ్రామాల అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పర్యటిస్తారు. గ్రామంలో 16నివాసా గృహాలను సందర్శించి యజమానుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 16 నివాసాల్లో ఎస్సీ–3, ఎస్టీ–3, ఇతర కుటుంబాలు–8, స్థానిక అధికారులు నిర్ణయించిన ఇళ్లు–2 ఉంటాయి. ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయిన అనంతరం కేంద్రానికి బృందం సభ్యులు నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా జిల్లాకు స్కోర్, ర్యాంకు ప్రకటిస్తారు.
మొత్తం1,000 మార్కుల విభజన ఇలా
● కేంద్ర బృందం నాలుగు రకాల అంశాలను విభజించి 1000 మార్కులు కేటాయిస్తోంది. సేవాస్థాయి పురోగతికి 240 మార్కులుంటాయి. ఘన, ద్రవ పదార్థాల నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్ ధ్రువీకరణ పత్రం, గ్రామసభ తీర్మాణం, ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉండాలి.
● గ్రామాల్లో స్వచ్ఛత స్థితి ప్రత్యక్ష పరిశీలనకు 540మార్కులు కేటాయించారు. ఇందులో మరుగుదొడ్ల వినియోగం, మల వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత అంశాలున్నాయి. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్ల వినియోగం, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛతపై అవగాహన, గోడ చిత్రాలు, కరపత్రాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండాలి.
● వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ప్రత్యక్ష పరిశీలనకు 120 మార్కులు కేటాయించారు. దీనిలో ప్లాస్టిక్, మల వ్యర్థాల నిర్వహణకేంద్రం, కంపోస్టుషెడ్ నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం తదితర అంశాలున్నాయి.
● ప్రజాభిప్రాయ సేకరణకు 100 మార్కులున్నాయి. ఇళ్లలో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా లేవా, బహిరంగ మలవిసర్జన చేసే ప్రాంతాలున్నాయా, మరుగుదొడ్డి నుంచి వచ్చే మలాన్ని మురికికాలువల్లో కలుపుతున్నారా, ఘన వ్యర్ధాల రవాణాకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంటింటి నుంచిచెత్త సేకరణ జరుగుతుందా లేదా, ఐదేళ్లలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితుల్లో మార్పులేమైనా వచ్చాయా, లేదా, భవిష్యత్తులో కార్యక్రమాల నిర్వహణపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు.
కలెక్టర్‌ను కలిసిన కేంద్ర బృందం
జిల్లాలోని 20 గ్రామాల్లో పర్యటన