
ప్రయాణం.. ప్రమాదకరం!
కొత్తపల్లి ●:
ఫోర్‌లేన్ రోడ్డుపై ప్రయాణం అంటే సాఫీగా సాగిపోతుందని అనుకుంటాం. కానీ కరీంనగర్–సిరిసిల్ల రహదారిపై అది అంత ఈజీ కాదు. కరీంనగర్ శివారు తర్వాత ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల బురదనీరు, సమీపంలోని నివాసాల నుంచి వచ్చే బురదనీటితో ఈ రోడ్డు పాడైపోయింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఈ ప్రధాన రహదారిపై నిలిచిన మురికి, వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు ధ్వంసమైంది. పొద్దంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండగా.. రాత్రి వేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
అంతా అస్తవ్యస్తం
● పద్మనగర్, ఒడ్యారం మధ్య రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బావుపేట పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన డ్రెయినేజీ అస్తవ్యస్తంగా వదిలేయడంతో సమస్య ఉత్పన్నమైంది.
● స్థానిక ఎన్టీఆర్ తమిళకాలనీ నుంచి వస్తున్న మురికినీటికి తోడు గ్రానైట్ బురదనీరు డ్రెయినేజీల్లో నిండుకుంటోంది. గ్రానైట్ కట్టింగ్ మిషన్ల నుంచి వస్తున్న బురదనీటితోనే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ మురికినీటికి మళ్లింపు లేకపోవడంతో రోడ్డుపైకి చేరి కుంటలా తయారవుతుంది. పారిశ్రామిక ప్రాంతం బావుపేట నుంచి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి తదితర ప్రాంతాలతోపాటు అటు వైపు నుంచి బావుపేటకు వచ్చే వాహనాల తాకిడితో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
పరిష్కారమేది?
గత నెలలో కలెక్టర్ ఆదేశాలతో కరీంనగర్ ఆర్డీవో, ఆర్‌అండ్‌బీ అధికారులు వచ్చి తాత్కాలికంగా మురికినీటి మళ్లింపు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షానికి తోడు మురికినీరు వచ్చి చేరుతుండటంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రహదారి నిర్మాణ సమయంలో పట్టా భూముల్లోంచి డ్రెయినేజీ నిర్మించొద్దంటూ స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో డ్రెయినేజీ ఆగిపోయింది.
డ్రెయినేజీ నిర్మాణమే పరిష్కారం
బావుపేట వద్ద నిలిచిన మురికి నీటి మళ్లింపునకు డ్రెయినేజీ నిర్మాణమే పరిష్కారమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డుపై నిలుస్తున్న మురుగునీరు, గ్రానైట్ బురద
కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై భారీ గుంతలు
బావుపేట వద్ద డేంజర్ స్పాట్లు
రూ.90 లక్షలతో ప్రతిపాదనలు
కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో భాగంగా బావుపేటలో నిలిచిన మురికినీటి మళ్లింపునకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. 750 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి రూ.90లక్షల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వ అనుమతి రాగానే పనులు చేపడతాం. రహదారి నిర్మాణంలో భాగంగా మురికినీటిని మళ్లించే చర్యలకు పట్టాదారులు అడ్డు చెప్పడంతోనే సమస్య ఏర్పడింది. ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రహదారులకు వారే సహకరించకపోతే మేము చేసేదేముంది. అయినప్పటికీ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.
– నర్సింహాచారి, ఈఈ ఆర్ అండ్ బీ
శాశ్వత పరిష్కారం చూపాలి
కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి బావుపేట వద్ద నిలుస్తున్న నీటితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలికంగా మురికినీటి మళ్లింపు పనులతో సమస్య పరిష్కారం కాదు. స్థానికుల సహకారంతో చేపడుతున్న చర్యలతో ఫలితాలివ్వడంలేదు. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన డ్రెయినేజీ నీటిమళ్లింపు చర్యలు చేపట్టాలి. ప్రతీ రోజు వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరగడం బాధాకరం.
– రెడ్డవేణి మధు, ఏఎంసీ మాజీ చైర్మన్

ప్రయాణం.. ప్రమాదకరం!

ప్రయాణం.. ప్రమాదకరం!

ప్రయాణం.. ప్రమాదకరం!