
వీళ్లు నరుకుతున్రు!
వాళ్లు నాటుతున్రు..
● అడ్డొస్తున్నాయని రోడ్ల వెంట చెట్ల తొలగింపు ● కరీంనగర్ సిటీలో వ్యాపారుల చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్ ●:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో చేపడుతున్న వనమహోత్సవం కొంతమంది వ్యాపారుల కారణంగా లక్ష్యానికి దూరమవుతోంది. తమ వ్యాపారాలు స్పష్టంగా కనిపించాలనే నెపంతో దుకాణాల ఎదురుగా ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెట్లను తొలగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలు వ్యాపారులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. తమకున్న పలుకుబడిని ఉపయోగించి అధికారులపై ఒత్తిళ్లు పెంచడం ద్వారా చర్యల నుంచి తప్పించుకుంటున్నారు.
కనిపించాలని...
కరీంనగర్ సిటీ శరవేగంగా విస్తరిస్తుండడం, అభివృద్ధి పనులు భారీగా పెరుగుతున్న క్రమంలో పచ్చదనం కనుమరుగవవుతోంది. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో రోడ్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా అప్పటికే ఉన్న భారీ చెట్లను తొలగించాల్సి వస్తోంది. దీంతో ఎదురయ్యే పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు, రోడ్ల వెంట మళ్లీ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడాన్ని బల్దియా చేపడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లకు ఇరువైపులా, మీడియన్స్‌ల్లో చెట్లు పెంచుతున్నారు. అయితే రోడ్లకు ఇరువైపులా పెరుగుతున్న చెట్లను కొంతమంది వ్యాపారులు తొలగిస్తుండడం వివాదాస్పదమవుతోంది. దుకాణాలు స్పష్టంగా కనిపించాలనే నెపంతో, రోడ్లపై నగరపాలక సంస్థ నాటిన చెట్లను కొట్టేస్తున్నారు. మరికొందరు కొమ్మలను కట్‌చేస్తున్నారు.
హెచ్చరికలు బేఖాతరు
రోడ్ల పక్కనున్న చెట్లను తొలగిస్తే చర్యలు తీసుకుంటామనే అధికారుల హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. గతంలో గాంధీరోడ్‌లోని ఓ దుకాణ నిర్వాహకులు తమ ముందున్న చెట్టును జేసీబీతో పూర్తిగా తొలగించారు. రోడ్డుపై చెట్టున్న జాడ కూడా లేకుండా మాయంచేశారు. ఇటీవల కలెక్టరేట్ రోడ్డులోని ఓ వ్యాపారి తన షాప్ ముందున్న రెండు చెట్లను కొట్టేశారు. రాంనగర్‌లోని ఓ వ్యాపారి తన షాప్ ముందున్న చెట్టు కొమ్మలు పూర్తిగా తొలగించారు. కాగా చెట్లను కొడితే రూ.5 వేలు జరిమానా, కేసు కూడా నమోదు అవుతుందని చెబు తున్నా.. వ్యాపారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. పైగా తమకున్న రాజకీయ, ఇతర త్రా పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. మున్సి పల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప.. నగరంలోని చెట్లకు రక్షణ ఉండదని పలువురు పేర్కొంటున్నారు.

వీళ్లు నరుకుతున్రు!

వీళ్లు నరుకుతున్రు!