
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం
● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం
కోల్‌సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్‌కు సమర్పించారు. గోదావరిఖని పవర్‌హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్‌కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు.