
అప్పుల బాధతో దినసరి కూలీ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన దినసరి కూలి కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పోచయ్యకు ఒక్కగానొక్క కూతురు చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండగా.. పలు ఆస్పత్రుల్లో చూపించేందుకు రూ.2లక్షల వరకు వెచ్చించాడు. కుటుంబ పోషణ, కూతురుకు వైద్యం అందించేందుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య రాజవ్వ, కుమార్తె తిరుమల ఉన్నారు. ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
కరీంనగర్ క్రైం: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ కూలీ కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన సునీల్ విశ్వకర్మ(29) భవన నిర్మాణ కూలీ పనులు చేసేందుకు కరీంనగర్‌కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం నగరంలోని చైతన్యపురిలో ఒక భవనంలో పనిచేస్తుండగా ఇనుప చువ్వలను కట్‌చేసే క్రమంలో కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయాడు. తోటి కార్మికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయంపై అతని భార్య పూజ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హైందవ సంస్కృతిని ఇతర దేశాలూ ఆచరిస్తున్నాయి
వేములవాడ: హైందవ సంస్కృతిని ప్రపంచ దేశాలు సైతం ఆచరిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నాలుగు రోజులుగా రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న చతుర్వే స్మార్త పరీక్షలు ఆదివారం ముగిశాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన పండితులు, విద్యార్థులనుద్దేశించి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన 157 మంది వేద పండిత విద్యార్థులకు పట్టాల పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేదపండితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈవో రధాభాయి, ఏఈవో శ్రీనివాస్, అశోక్‌కుమార్, జయకుమారి పాల్గొన్నారు.

అప్పుల బాధతో దినసరి కూలీ మృతి