కాలినడకన బడికి!
జిల్లాలో పాఠశాలలు
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల తండాకు చెందిన ఒకటి, రెండో తరగతి చదివే ఐదారేళ్ల వయస్సున్న పిల్లలు రోజూ మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న వెల్లుట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. మార్గమధ్యలో అడవి జంతువులు, కోతుల నుంచి తమల్ని తాము కాపాడుకునేందుకు పిల్లలు కర్రలు పట్టుకుని వెళ్తుంటారు. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి రవాణా భత్యం రావడం లేదు. ఈ ఏడాది ప్రతిపాదించిన దాంట్లో కూడా లేకపోవడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులు ఉన్న చోట బడి ఉండదు.. బడి ఉన్న చోట పంతుళ్లుండరు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాల్లో బడులు లేక, బడులు ఉన్నా టీచర్లు లేక చదువు కోసం విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది పిల్లలు కాలినడకన స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఐదారు కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లే వారున్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో గడిచిని పదేళ్లలో యాభైకి పైగా పాఠశాలలు మూతబడ్డాయి. కొన్ని చోట్ల విద్యార్థులు ఉన్నా టీచర్లు లేక మొక్కు‘బడి’గా నడుస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన పిల్లలు చదువు కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
రవాణా భత్యం కొందరికే..
అందుబాటులో బడులు లేని విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్‌తోపాటు పీఎం శ్రీ నిధుల నుంచి రవాణా భత్యం ఇస్తుంటారు. అయితే రకరకాల నిబంధనలతో చాలా మంది విద్యార్థులకు భత్యం అందడం లేదు. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలో 1,056 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున భత్యం మంజూరైంది. ఈ విద్యాసంవత్సరం 59 స్కూళ్లకు చెందిన 1,565 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందించాలని ప్రతిపాదనలు పంపించారు.
ప్రాథమిక పాఠశాలలు 702
విద్యార్థులు 30,045
ప్రాథమికోన్నత పాఠశాలలు 124
విద్యార్థులు 8,819
ఉన్నత పాఠశాలలు 191
విద్యార్థులు 32,109
అందుబాటులో స్కూళ్లు లేక
పొరుగూళ్లకు
బస్సులు లేకపోవడంతో
నడిచి వెళ్లాల్సిందే
కొందరికే అందుతున్న రవాణా భత్యం
సౌకర్యం కల్పించడమే పరిష్కారం


