ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఏడాది జైలు
బాల్కొండ: ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి ఏడాది జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేంద్ర గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మగల్లీకి చెందిన బండి నరేంద్ర 2025 ఏప్రిల్ 24న మండల కేంద్రంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించాడు. దీంతో అతనిపై పోలీస్ కేసు నమోదైంది. నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానాను విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
న్యూసెన్స్ కేసులో ఒకరికి నాలుగు రోజులు..
ధర్పల్లి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తికి జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి గురువారం తెలిపారు.
వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతాయిపేట్‌కు చెందిన భానుచందర్ రెండు రోజుల క్రితం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి తాను నివాసం ఉండే కాలనీలో న్యూసెన్స్ చేశాడు. దీంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి ఆధారాలను పరిశీలించి భానుచందర్‌కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు తెలిపారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


