రైతులకు తక్కువ ధరకే డ్రోన్ స్ప్రేయర్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చెరుకు రైతుల సంక్షేమమే గాయత్రి షుగర్స్ లక్ష్యమని, రూ.7.50 లక్షల విలువ చేసే డ్రోన్ స్ప్రేయర్‌ను రూ.లక్షకే అందజేస్తున్నా మని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, శంకర్‌రావు అన్నారు. గాయత్రి ఏఈఆర్‌వో ఆధ్వర్యంలో తయారు చేసిన డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ చేసే విధానంపై బుధవారం మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నూతన సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కామారెడ్డి, నిజాంసాగర్ గాయత్రీ షుగర్స్ పరిధిలో గల చెరుకు రైతుల అభివృద్ధి కోసం రైతు పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. స్ప్రేయర్ కొనుగోలు చేసిన రైతుకు ఒక బ్యాటరీ సెట్, చార్జర్‌తోపాటు డ్రోన్ నడిపే శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు రైతులకు బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. చెరుకు నాటిన రైతులకు రూ.9,437 విలువగల చెరుకు విత్తనం 2 టన్నుల 50 కిలోలను ఉచితంగా అందజేస్తుందన్నారు. గాయత్రి షుగర్స్ ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్, గాయత్రి షుగర్స్ ఫీల్డ్ మెన్లు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు.


