కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
మహిళా శిక్షకులను ఎంపిక చేస్తాం
మూడు నెలలపాటు శిక్షణ
● జిల్లాలోని 40 పీఎంశ్రీ బడుల్లో అమలు
● ఆరు నుంచి పదో తరగతి
విద్యార్థినులకు శిక్షణ
ఖలీల్‌వాడి: బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది నవంబర్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజీబీవీ, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమ లు చేయనున్నారు. ఈ బడుల్లో విద్యతో పాటు బాలికలకు కరాటే, జూడో, కుంగ్‌ఫూ వంటి వాటిని నేర్పిస్తారు. వీటిని నేర్పించడంతోపాటు విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందిస్తారు.
గతంలా కాకుండా..
గతంలో పాఠశాలల్లో కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి శిక్షణలను ఇష్టారాజ్యంగా నిర్వహించేవారు. విద్యార్థినులకు ప్రత్యేకమైన మెలకువలు నేర్పించాలనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు సమగ్ర శిక్షణ అధికారులు స్వీయరక్షణ కోసం ఇచ్చే మెలకువలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. శిక్షణకు ముందుగా విద్యార్థినులకు కసరత్తులు, స్కిల్ ట్రైనింగ్ తోపాటు వ్యాయామాలు చేయించిన తర్వాతే విద్యార్థినులకు కరాటే, కుంగ్‌పూ, జూడో వంటి వాటిపై శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 72 తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్లాసులను స్కూళ్లలోని పీఈటీ, పీడీ పర్యవేక్షణలో 45 నిమిషాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది.
పీఏం శ్రీ కింద ఉన్న పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో, కుంగ్‌ఫూ వంటి శిక్షణ అందిస్తాం. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో మహిళా శిక్షకులను ఎంపిక చేస్తాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. దీంతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఇవి పీఈటీల పర్యవేక్షణలో కొనసాగుతాయి. నవంబర్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. – భాగ్యలక్ష్మి,
జెండర్ ఈక్విటీ కో–ఆర్డినేటర్, నిజామాబాద్
జిల్లాలో 40 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. వీటిలో చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ విద్య అమలు చేయనున్నారు. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.30 వేల చొప్పు న నిధులు మంజూరయ్యాయి. వారానికి ఆరు సార్లు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. 50 మంది లోపు విద్యార్థినులు ఉంటే రూ.15 వేల వేతనం, 50 కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేల గౌరవ వేతనాన్ని శిక్షకులకు అందించనున్నారు. ఈ శిక్షణ నేర్పించేందుకు అవసరమైన మహిళా శిక్షకురాలను జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది.


