స్టడీ అవర్స్ పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ను ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు వారి ప్రతిభను గమనించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ధీటుగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర పరీక్షలకు కావాల్సిన సిలబస్‌ను ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ బోర్డు ద్వారా మంజూరైన రూ.16 లక్షల నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
బాన్సువాడరూరల్: పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోందని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం తాడ్కోల్ గ్రామ పంచాయతీలో అధికారులు, లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంజూరు వచ్చాక కూడా పనులు ప్రారంభించకపోవడానికి కారణాలను అడిగి తెల్సుకున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు జీఎస్‌టీ మినహాయించి రూ.4 లక్షలే బిల్లు ఇవ్వగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందన్నారు. డ్వాక్రా గ్రూప్‌లో ఉన్న మహిళలకు అదనంగా రూ.లక్ష బ్యాంకు రుణం మంజూరు చేయిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే విడతల వారీగా బిల్లులు చెల్లింపు చేస్తున్నామన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇండ్లకు భూమిపూజ చేశారు. నేతలు మధుసూదన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగారాం, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సూపరింటెండెంట్ ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద: తనపై అకారణంగా దాడి చేశాడంటు బిచ్కుంద ఎన్‌డీసీసీబీ మేనేజర్ త్రిశుల్‌పై పబ్బత్ తుకారాం అనే రైతు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన రైతు తుకారాం స్థానిక ఎన్‌డీసీసీబీలో ఏడేళ్ల క్రితం రుణం తీసుకున్నాడు. తాను తీసుకున్న లోన్ డబ్బులు కొంత తిరిగి ఇచ్చానని, మిగతా దానికి సమయం ఇవ్వాలని కోరినా బ్యాంక్ మేనేజర్ వినిపించుకోకుండా మంగళవారం జరిగిన వాగ్వాదంలో తనపై దాడి చేశాడని ఆరోపించాడు. తాను ఇంట్లో లేని సమయంలో మహిళలను దూషించాడని రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్‌ను వివరణ కోరగా తాను మహిళలను దూషించలేదని తుకారాం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
స్టడీ అవర్స్ పరిశీలన


