ప్రారంభించిన ఒక రోజుకే దిగబడ్డ లారీ
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. 45 రోజులుగా బస్సులు, లారీల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చొరవతో డైవర్షన్ రోడ్డుకు రూ.కోటి మంజూరు చేయించారు. నెల రోజుల నుంచి డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారు. మొదట వర్షాలు కురియడంతో రోడ్డు పనులు నత్తనడకన కొనసాగాయి. పది రోజులుగా వర్షాలు ఆగిపోయి ఎండలు కొడుతుండటంతో రోడ్డు పనుల్లో వేగం పెంచారు. వాగు మధ్యలో కంకర రోడ్డు వేసి రెండు వరుసల్లో పైపులు వేశారు. పైపులకు ఇరువైపులా మొరం వేసి రోలర్‌తో తొక్కించి రాకపోకలు పునరుద్ధరించారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి కంకర, రాళ్లు వేయకుండానే కేవలం మొరం వేయడంతో రాకపోకలు పునరుద్ధరించిన ఒక రోజుకే లారీ దిగబడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వంతెనకు ఇరువైపులా మొరం దిగబడుతుండడంతో ఆదివారం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం తిరిగి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఆర్‌ఈండ్‌బీఽ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగించే రోడ్డు నాణ్యతగా చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.


